CCMB: గాలిలో కరోనా క్రిముల వ్యాప్తిపై సీసీఎంబీ ఆసక్తికర అధ్యయనం

CCMB researchers says no significance threat from corona through air
  • గాల్లో కరోనా వ్యాపిస్తుందని వెల్లడి
  • అయితే అది 2 నుంచి 3 మీటర్ల లోపే అని వివరణ
  • ఇదేమంత ఆందోళనకరం కాదన్న సీసీఎండీ
ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ గాల్లోనూ ప్రయాణించినా, అదేమీ ఆందోళన చెందాల్సినంత స్థాయిలో లేదని హైదరాబాదులోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) పరిశోధకులు చెబుతున్నారు. కరోనా రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లలో ఉండే కరోనా వైరస్ గాలిలోని దుమ్ముకణాలతో కలిసి 2 నుంచి 3 మీటర్ల వరకు ప్రయాణిస్తున్నట్టు తెలిసిందని సీసీఎంబీ తన అధ్యయనంలో వివరించింది.

హైదరాబాదులో కరోనా చికిత్స జరుగుతున్న ఆసుపత్రుల్లోనూ, కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి నమూనాలను పరిశీలించి ఈ మేరకు నిర్ధారణ చేశారు. గాలి ధారాళంగా వెళ్లేందుకు ఏర్పాట్లు లేని గదుల్లో వైరస్ ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. గాలి బాగా వెళ్లేందుకు ఏర్పాట్లు ఉన్న గదుల్లో వైరస్ ఉనికి ఏమంత ఎక్కువగా కనిపించలేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా  తెలిపారు.

కాగా, కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాప్తి చెందుతున్నట్టు అనేక దేశాల పరిశోధన సంస్థలు, పలు దేశాల శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించారు. అయితే, కరోనా గాలి ద్వారా వ్యాపిస్తున్న తీరు ఆయా దేశాల్లో ఆందోళన చెందుతున్న స్థాయిలో మాత్రం లేదని రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు.
CCMB
Corona Virus
Air
Spreading
Contamination

More Telugu News