V Prashanth Reddy: అమర జవాను ర్యాడా మహేశ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ కంటతడి పెట్టిన తెలంగాణ మంత్రి
- ఉగ్రవాదుల కాల్పుల్లో ర్యాడా మహేశ్ వీరమరణం
- కోమన్ పల్లి వెళ్లిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
- మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ
జమ్మూకశ్మీర్ లో చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను ర్యాడా మహేశ్ కు నివాళులు వెల్లువెత్తుతున్నాయి. మహేశ్ మృతితో ఆయన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లిలో విషాదం నెలకొంది. కాగా, తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ కోమన్ పల్లి వెళ్లారు. శోకసంద్రంలో మునిగిపోయిన అమర జవాను ర్యాడా మహేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన కూడా భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. మహేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ తాను కూడా కంటతడి పెట్టారు. అనంతరం మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాను కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ర్యాడా మహేశ్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని కీర్తించారు. మహేశ్ అంత్యక్రియలు కోమన్ పల్లిలో నిర్వహించేందుకు మంత్రి హైదరాబాద్ సైనిక కార్యాలయం అధికారులతో మాట్లాడారు.