Arnab Goswami: అర్నాబ్ కు షాకిచ్చిన బాంబే హైకోర్టు!
- బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అర్నాబ్
- కింద కోర్టులో దరఖాస్తు చేసుకోవాలన్న హైకోర్టు
- అలీబాగ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసిన అర్నాబ్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలతో అర్నాబ్ తో పాటు మరో ఇద్దరిని ముంబైలోని అలీబాగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తమ అరెస్ట్ అక్రమమని, రెండేళ్ల క్రితం కేసును మళ్లీ తిరగదోడారంటూ హైకోర్టును అర్నాబ్ ఆశ్రయించారు. మధ్యంతర మెయిల్ పై శనివారం వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ ను తిరస్కరిస్తూ ఈరోజు తన తీర్పును వెలువరించింది. అయితే, బెయిల్ పిటిషన్ ను దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీంతో, అలీబాగ్ లోని సెషన్స్ కోర్టులో అర్నాబ్ తరపు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు, తొలుత అర్నాబ్ ను అలీబాగ్ జైల్లోని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. అయితే ఆయన మరొకరి మొబైల్ ఫోన్ తీసుకుని, వాడుతున్నట్టు సమాచారం రావడంతో నిన్న తలోజా జైలుకు తరలించారు.