George Bush: చట్ట పరంగా పోరాడే హక్కు ట్రంప్ కు ఉంది: జార్జ్ బుష్
- దేశం కోసం అందరూ ఒకే తాటిపైకి రావాలి
- ట్రంప్ 70 మిలియన్ల ఓట్లను సాధించారు
- రీకౌంటింగ్ కోరే హక్కు ట్రంప్ కు ఉంది
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలాంటి అవినీతి లేకుండా జరిగాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ అన్నారు. దేశ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చారని చెప్పారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించబోతున్న జో బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే దేశాధ్యక్షుడిగా సేవలు అందించిన డొనాల్డ్ ట్రంప్ కు కూడా అభినందనలు తెలిపారు. ట్రంప్ కూడా 70 మిలియన్ల ఓట్లను సాధించారని... రాజకీయపరంగా ఇది గొప్ప విజయమని అన్నారు. రీకౌంటింగ్ కోరే హక్కు కానీ, ఫలితాలపై చట్టపరంగా పోరాడే హక్కు కానీ ట్రంప్ కు ఉంటుందని చెప్పారు. జార్జ్ బుష్ సోదరుడు జెబ్ బుష్ కూడా బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 2016లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి జెబ్ బుష్ పోటీ పాడ్డారు.