Jagan: అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్

CM Jagan announces fifty lakhs to martyred soldier Praveen Kumar Reddy family

  • ఉగ్రవాదులతో పోరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం
  • సీఎం సహాయ నిధి నుంచి భారీగా ఆర్థికసాయం
  • దయచేసి స్వీకరించాలని ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని కోరిన సీఎం జగన్

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకునే క్రమంలో అసువులుబాసిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సీఎం జగన్ భారీ సాయం ప్రకటించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి దేశం కోసం చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయం అని పేర్కొన్న సీఎం జగన్ ఆ వీరసైనికుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం సహాయనిధి నుంచి ఈ ఆర్థికసాయం మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో వెల్లడించారు.

మీ భర్త చేసిన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య రజితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం సమయంలో మీ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నామని, దయచేసి స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వస్థలం ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామం. ఆయన మద్రాస్ రెజిమెంట్ లో హవల్దార్ గా పనిచేస్తున్నారు. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన ఇద్దరు జవాన్లలో ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు.

  • Loading...

More Telugu News