Donald Trump: ఫైజర్ వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధం... కావాలనే వాళ్లు చెప్పలేదని ట్రంప్ ఆరోపణ!

Trump Sensational Comments onPFizer Vaccine

  • ఎఫ్డీయే అధికారులతో ఫైజర్ కుమ్మక్కు
  • ఎన్నికలకు ముందే చెప్పే ధైర్యం లేకపోయింది
  • నేను వ్యాక్సిన్ సిద్ధమైందని ఎన్నడో చెప్పాను
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించడంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధమైందని, అయితే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అధికారులతో కుమ్మక్కై, ఫైజర్ వ్యాక్సిన్ ఫలితాలను ప్రకటించలేదని ఆరోపించారు.

 కరోనాపై విజయం సాధించే దిశగా వ్యాక్సిన్ తయారైందని ఎన్నికలకు ముందే ప్రకటించడాన్ని డెమొక్రాట్లు ఇష్టపడలేదని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ పెడుతూ, వ్యాక్సిన్ విషయాన్ని తాను ఎన్నడో ప్రజలకు తెలియజేశానని అన్నారు. అధికారిక ప్రకటనను సంస్థ కావాలనే ఆలస్యం చేసిందని అన్నారు.

"జో బైడెన్ అధ్యక్షుడైతే మరో నాలుగేళ్ల పాటు వ్యాక్సిన్ రాబోదని నేను చెప్పగలను. వ్యాక్సిన్ ను యూఎస్ ఎఫ్డీయే కూడా త్వరగా అనుమతించదు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను వారి వైఖరి ప్రమాదంలోకి నెట్టనుంది"అన్నారు. "నేను చాలాకాలంగా భావిస్తున్నట్టుగానే, ఫైజర్, ఇతర సంస్థలు ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని భావించలేదు. ముందే ఈ పని చేసే ధైర్యం వారికి లేకపోయింది. యూఎస్ ఎఫ్డీయే సైతం రాజకీయ ప్రయోజనాలనే చూసింది" అని అన్నారు.

కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని, మరిన్ని నెలల పాటు ప్రజలు వైరస్ ను ఎదుర్కొనేలా తమవంతు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుందని వ్యాఖ్యానించిన ట్రంప్, వ్యాక్సిన్ తయారీ వెనకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఫైజర్ నుంచి వచ్చిన ప్రకటన జాతికి కొత్త ఊపిరిని ఇచ్చిందని అన్నారు. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం ఫైజర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News