Dubbaka: దుబ్బాకలో కారు కొంపముంచిన రోటీ మేకర్!
- ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నాగరాజు
- 3,570 ఓట్లు రావడంతో పలువురి విస్మయం
- కారును పోలినట్టుగా గుర్తు ఉండటంతో టీఆర్ఎస్ కు నష్టం
దుబ్బాకలో అనూహ్యంగా టీఆర్ఎస్ ఓడిపోవడానికి, ఓ స్వతంత్ర అభ్యర్థి రోటీ మేకర్ (చపాతీ పీట) గుర్తుపై పోటీ చేయడం కూడా కారణమైందని రాజకీయ నిపుణులు అంచనా వేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సూర్యాపేట జిల్లా బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన బండారు నాగరాజు, దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు రోటీ మేకర్ గుర్తు వచ్చింది. నాగరాజుకు ఈ ఎన్నికల్లో 3,570 ఓట్లు రావడం పరిశీలకులను విస్మయపరిచింది.
ఈ ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రెండు ఈవీఎంలను వాడాల్సి వచ్చింది. తొలి ఈవీఎంలో మూడవ నంబర్ లో కారు గుర్తు ఉండగా, రెండో ఈవీఎంలో కారును పోలిన రోటీమేకర్ గుర్తు ఉంది. ఇది చాలా మంది ఓటర్లను అయోమయానికి గురి చేసిందని, కారు గుర్తుగా పొరపడిన చాలా మంది రోటీ మేకర్ కు ఓటు వేసి వుండవచ్చని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా కారణం కావచ్చని అంటున్నారు.