Bihar: ఈసీ అధికారిక ప్రకటన... బీహార్ లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ... తుది ఫలితాలు ఇవిగో!
- 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
- 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ
- 74 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో
బీహార్ లో ఎన్నికలు జరిగిన 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు తుది ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 75 స్థానాల్లో గెలిచిన రాష్ట్రీయ జనతాదళ్ అతిపెద్ద పార్టీగా నిలువగా, ఆ వెనుకనే 74 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే, అధికారం మాత్రం ఎన్డీయే కూటమికే దక్కింది. నితీశ్ నేతృత్వంలోని కూటమి 125 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంది.ఇక వివిధ పార్టీలు సాధించిన సీట్లను పరిశీలిస్తే, ఎంఐఎం 5, బహుజన్ సమాజ్ పార్టీ 1, భారతీయ జనతా పార్టీ 74, సీపీఐ 2, సీపీఎం 2, సీపీఐ ఎంఎల్ 12 సీట్లను సాధించాయి. హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 4, కాంగ్రెస్ 19, జనతాదళ్ 43, లోక్ జనశక్తి పార్టీ 1, రాష్ట్రీయ జనతాదళ్ 75, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ 4 సీట్లను సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు ఒక స్థానంలో గెలుపొందారు. మొత్తం 243 సీట్ల ఫలితాలూ వెల్లడయ్యాయి.ఇక ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, ఆర్జేడీకి 23.1 శాతం, బీజేపీకి 19.46 శాతం, జేడీయూకు 15.4 శాతం, కాంగ్రెస్ కు 9.5 శాతం, ఇతరులకు 18.8 శాతం ఓట్లు వచ్చాయి. బీహార్ లో 5 సీట్లను గెలుచుకున్న ఎంఐఎంకు 1.24 శాతం ఓట్లు వచ్చాయి. ఒక సీటు గెలుచుకున్న బీఎస్పీకి 1.49 శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీకి 5.66 శాతం ఓట్లు వచ్చినా, ఆ పార్టీ ఒక్క సీటుకే పరిమితం కావడం గమనార్హం.