Bihar: మ్యాజిక్ ఫిగర్ కు మూడు సీట్లు మాత్రమే అధికం... బీహార్ లో 'బీజేపీ మార్కు' రాజకీయం?

Only 3 Seats Higher for NDA in Bihar

  • 125 స్థానాల్లో గెలిచిన ఎన్డీయే
  • ఇరకాటంగా మారనున్న హిందుస్థానీ అవామ్ మోర్చా, వికాస్ షీల్ ఇన్సాన్
  • ఈ రెండు పార్టీలకు 8 సీట్లు
  • నితీశ్ కి సీఎం పదవి దక్కేనా?   

బీహార్ ఎన్నికల్లో అధికారాన్ని ఎన్డీయే నిలుపుకుంది. నితీశ్ కుమార్ నేతృత్వంలో కూటమిగా పోటీ చేసిన జేడీయూ, బీజేపీలు మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లో 125 స్థానాలను సాధించాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో 122 మేజిక్ ఫిగర్ కాగా, దానికి మూడు సీట్లను మాత్రమే అధికంగా సంపాదించడం ద్వారా నితీశ్ అధికారాన్ని నిలుపుకున్నారు. అయితే, మెజారిటీ తక్కువగా ఉండటం, ప్రతిపక్షం బలంగా ఉండటంతో బీహార్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయా? అన్న కోణంలో కొందరు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు.

ఇక మహా ఘటబంధన్ 110 సీట్లకు పరిమితం కాగా, ఎన్డీయేలో ఉండి కూడా ఆ కూటమితో కలిసి చేరకుండా, విడిగా పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 1 స్థానానికే పరిమితం కాగా, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 15 గంటల పాటు కొనసాగడం గమనార్హం. పలు చోట్ల ఈవీఎంలు తెరచుకోకపోవడంతోనే ఫలితాల వెల్లడి ఆలస్యం అయిందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. తుది ఫలితం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెల్లడైంది.

ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగగా, గెలిచిన, ఓడిపోయిన కూటముల మధ్య ఒక శాతం ఓట్ల తేడా కూడా లేకపోవడం గమనార్హం. ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 74, జేడీయూకు 43, మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు 4, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి 4 స్థానాలు వచ్చాయి. ఈ మొత్తం కలిపితే 125 సీట్లు అవుతాయి.

ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ దూరమైనా, బీహార్ లో ఎన్డీయే సర్కారుకు మెజారిటీ పడిపోతుంది. అలాలాకుండా, బీజేపీ తనదైన రాజకీయం చేసి, ఇతర పార్టీలలోని వారిని కొందరిని తన వైపు లాగేసుకుని అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఈ 'బీజేపీ మార్కు' రాజకీయం అమలైన విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.

ఇదిలావుంచితే, ముందుగా హామీ ఇచ్చినట్టుగా నితీశ్ కే సీఎంగా అవకాశాన్ని బీజేపీ ఇస్తుందా? లేక తమది పెద్ద పార్టీ కాబట్టి, తమకే ముఖ్యమంత్రి పదవి అనే సూత్రాన్ని తెరపైకి తెస్తుందా? అన్న విషయం నేడో, రేపో తేలిపోతుంది. అలా ఆలోచిస్తే కనుక, నితీశ్ ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని, రాష్ట్రానికి తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News