PFizer: ఇండియాకు అర్జంట్ గా టీకా... ఫైజర్ తో చర్చిస్తున్న కేంద్రం!
- జర్మనీ సంస్థతో కలిసి తయారు చేసిన ఫైజర్
- మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేస్తేనే వినియోగంలోకి
- కోల్డ్ చెయిన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి
- ధర విషయంలోనూ ఇంకా రాని స్పష్టత
- వినియోగించే ముందు లోకల్ ట్రయల్స్ యోచన
యూఎస్ ఫార్మాస్యుటికల్ దిగ్గజం ఫైజర్, జర్మనీ బయోటెక్ సంస్థ బయో ఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఇండియాకు తెచ్చేందుకు కేంద్రం చర్చలు ప్రారంభించింది. తమ వ్యాక్సిన్ 90 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తోందని రెండు రోజుల క్రితం ఫైజర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ ను ఇండియాలో వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఫైజర్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది.
కాగా, ఫైజర్ తన వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా 40 వేల మందికి టీకాను వేయగా, ఇప్పటివరకూ 94 మందికి సంబంధించిన హెల్త్ రిపోర్టులు మాత్రమే విడుదల అయ్యాయి. వీరందరూ కనీసం రెండు నెలల పాటు కొవిడ్ ను ఎదుర్కొన్నారని ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా తెలియజేస్తోంది. ఇక వయోవృద్ధుల విషయంలో డేటా ఇంకా వెల్లడి కాలేదు. ఎంతకాలం పాటు ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుందన్న విషయంపైనా పూర్తి సమాచారం లేదు.
అయినా ఈ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వాడేందుకు అనుమతించాలని యూఎస్ రెగ్యులేటరీ సంస్థలను ఫైజర్ ఇప్పటికే కోరింది. ఈ విషయంలో మరో వారంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, 2020లో ఫైజర్ వ్యాక్సిన్ 50 మిలియన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ డోస్ లను అమెరికాతో పాటు యూకే, జపాన్ తదితర దేశాల్లో ఇప్పటికే తాము చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పంచాలని ఫైజర్ భావిస్తోంది.
ఇండియాకు సంబంధించినంత వరకూ ఫైజర్ తో ఇంతవరకూ ఎటువంటి ఒప్పందమూ కుదరలేదు. వ్యాక్సిన్ ను ఇండియాకు తెచ్చేలా ఒప్పందం కుదిరితే, వినియోగానికి అనుమతించే ముందు లోకల్ ట్రయల్స్ ను నిర్వహించాలని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి వుండగా, ఇండియాలో వ్యాక్సిన్ నిల్వకు అవసరమైన మౌలిక వసతులపై కొన్ని అనుమానాలను వైద్య ఆరోగ్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ టీకా ఆర్ఎన్ఏ ఆధారంగా తయారైనది కావడంతో అత్యంత శీతల వాతావరణంలోనే భద్రపరచాల్సి వుంటుంది. దీంతో కోల్డ్ చైన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై ప్రభుత్వం మరింత దృష్టిని సారించాల్సి వుంది. ఇక దీని ధరపైనా ఇంకా స్పష్టత రాలేదు. ధర విషయంలోనూ డీల్ కుదరాల్సి వుంది.