Bihar: మాట తప్పేది లేదు... నితీశ్ కుమారే బీహార్ సీఎం: తేల్చి చెప్పిన బీజేపీ
- బీజేపీ కన్నా తక్కువ సీట్లలో గెలిచిన జేడీ(యూ)
- సీఎంగా నితీశే ఉంటారన్న సుశీల్ కుమార్ మోదీ
- ప్రధాన మంత్రిత్వ శాఖలు బీజేపీ చేతిలోనే అంటున్న విశ్లేషకులు
బీహార్ లో జేడీ (యూ)కు బీజేపీ కన్నా సీట్లు తగ్గినంత మాత్రాన, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ను తొలగించి, మరొకరిని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రశ్నే లేదని, బీహార్ కు సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ తేల్చి చెప్పింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన అనంతరం బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. "నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారు. ఇది మేమిచ్చిన మాట. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు" అని ఆయన అన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో 243 సీట్లకు బీజేపీ 74 సీట్లలో గెలవగా, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ 43 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఇతర ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించిన నేపథ్యంలో, సీఎంగా మరొకరి పేరును బీజేపీ తెరపైకి తేనుందని వార్తలు వస్తుండగా, బీజేపీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. "కొంతమంది అధిక సీట్లను గెలుస్తారు. కొంతమంది తక్కువ సీట్లను గెలుస్తారు. అయితే, బీహార్ లో మేము సమాన భాగస్వాములం" అని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా, బీహార్ ను బీజేపీ ఇంతవరకూ సొంతంగా పాలించలేదు. ఈ ఎన్నికల అనంతరం కూడా నితీశ్ సహకారం లేకుంటే, అధికారంలో ఉండే అవకాశాలు బీజేపీకి ఎంతమాత్రమూ లేవు. అయితే, మారిన సమీకరణాల నేపథ్యంలో పదవీ బాధ్యతల పంపకంలో మాత్రం గతంలో ఉన్న పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో పోలిస్తే, జేడీయూకు తక్కువ బలం ఉండటంతో, నితీశ్ సీఎంగా ఉన్నా, ప్రధాన మంత్రిత్వ శాఖలతో పాటు అధికారాలన్నీ బీజేపీ చేతిలోనే ఉంటాయని, ప్రస్తుతానికి బీహార్ లో బీజేపీ బలపడేందుకు ఈ మాత్రం సరిపోతుందని విశ్లేషిస్తున్నారు.