Bandi Sanjay: భూసార పరీక్షల కోసం కేంద్రం ఇచ్చిన రూ.125 కోట్లు ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలి: బండి సంజయ్

Bandi Sanjay fires on CM KCR in the wake of Dubbaka win

  • దుబ్బాక ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారని విమర్శలు
  • దుబ్బాక ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నారని వెల్లడి
  • ప్రజల సొమ్మును ఎంఐఎంకి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపణ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించడంతో ఊపుమీదున్న బండి సంజయ్... సీఎంపై ఘాటుగా స్పందించారు. నియంతృత్వ, నికృష్ట, అవినీతి, కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవాలని భావించిన తెలంగాణ ప్రజలు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని ఆదరించారని వెల్లడించారు.

కరోనా విపత్తు, వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితో ప్రగతిభవన్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను పాతబస్తీకి, ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు దండుకునే కుట్రలో భాగంగానే రూ.10 వేల ఆర్థికసాయం ప్రకటించారని మండిపడ్డారు. వరద బాధితులకు ఇవ్వాల్సిన సొమ్మును టీఆర్ఎస్ నేతలు దోచుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్న వడ్లు పండించాలని సీఎం చెబితే రైతులు అనేక ఇబ్బందులు పడి వాటిని పండించారని, కానీ వడగళ్ల వానపడి పంటలు దెబ్బతింటే వారిని ఆదుకునే దిక్కులేదని బండి సంజయ్ విమర్శించారు. రైతులను సన్న వడ్లు పండించమన్న కేసీఆర్ తన ఫాంహౌస్ లో దుడ్డురకం వరి పండిస్తూ ద్వంద్వ వైఖరితో రాచరికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో భూసార పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.125 కోట్లు ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో సామాన్యులను దోచుకుంటున్న సీఎం వైఖరిని ప్రజలు గమనించాలని బండి సంజయ్ సూచించారు.

  • Loading...

More Telugu News