Andhra Pradesh: పర్యావరణానికి హాని చేయని టపాసులే కాల్చాలి: దీపావళి మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కారు
- ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ఉత్తర్వులు
- కేవలం 2 గంటల పాటే టపాసులు కాల్చాలని స్పష్టీకరణ
- రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా ఏపీ సర్కారు పండుగల సందర్భంగా టపాసులు కాల్చడంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ ను దృష్టిలో ఉంచుకుని, కాలుష్య వ్యాప్తికి కారణమయ్యే టపాసులు కాల్చరాదని, పర్యావరణానికి హాని చేయని టపాసులే కాల్చాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
దీపావళి, గురు పూరబ్ పర్వదినాల సందర్భంగా 2 గంటల పాటు టపాసులు పేల్చుకోవచ్చని, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. చాత్ పర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే కాల్చాలని, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంగా రాత్రి 11.55 గంటల నుంచి 12.30 గంటల వరకు కాల్చాలని తన మార్గదర్శకాల్లో వివరించింది.
గాలి నాణ్యత స్థాయి నాసిరకంగా ఉన్న ప్రాంతాల్లో కేవలం పర్యావరణానికి హాని కలిగించని టపాసులు మాత్రమే విక్రయించాలని పేర్కొంది. వాతావరణ కాలుష్యం ఎక్కువగా, ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో అన్నిరకాల టపాసులు పేల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిషేధం విధించిందని ఏపీ సర్కారు తన మార్గదర్శకాల్లో పేర్కొంది.