Rohit Sharma: రోహిత్ శర్మ బాధ్యతలను ఎప్పుడూ భారం అనుకోడు: చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్
- రోహిత్ శర్మ బాధ్యతలను ఆస్వాదిస్తాడని వెల్లడి
- కెప్టెన్సీని భారం అనుకోడని వివరణ
- రోహిత్ నాయకత్వ వైఫల్యాలు చాలా తక్కువన్న లాడ్
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టిస్తూ ఐదోసారి టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి జట్టు లీగ్ లో సరికొత్త ప్రమాణాలు నమోదు చేసింది. రోహిత్ ప్రాభవంపై చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని భారం అనుకోడని, బాధ్యతల ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదని అన్నారు. ఎంత ఒత్తిడి ఎదురైతే అంతగా ఆస్వాదిస్తాడని తెలిపారు.
రోహిత్ పాఠశాల రోజుల నుంచే నాయకత్వ లక్షణాలు కనబర్చేవాడని వెల్లడించారు. తాను ఎప్పుడు నాయకత్వం వహించమని కోరినా, ఒంటిచేత్తో విజయాలు అందించేవాడని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ గెలుపు గురించే ఆలోచిస్తాడని, ఓటమి భావన దరిచేరనివ్వడని వివరించారు.
ముంబయి ఇండియన్స్ జట్టు పగ్గాలు అప్పగించగానే తన కెప్టెన్సీ సామర్థ్యాలను నిరూపించుకున్నాడని, అతని కెరీర్ కు అది అదనపు శోభను చేకూర్చిందని అన్నారు. రోహిత్ శర్మకు బాధ్యతలు పెరిగినా ఒత్తిడి పెరగదని దినేశ్ లాడ్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీలో రోహిత్ విఫలం కావడం తాను చాలా అరుదుగా చూశానని ఆయన వెల్లడించారు.