pfizer: ఆశలు రేకెత్తించిన ‘ఫైజర్’ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో సైడ్ ఎఫెక్ట్స్!
- తమ వ్యాక్సిన్ 90 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఇటీవలే ప్రకటన
- అంతలోనే వాలంటీర్లలో దుష్ప్రభావాలు
- ఒంటి నొప్పి, తలనొప్పి, తీవ్రమైన హ్యాంగోవర్
- స్పందించని ఫైజర్ సంస్థ
జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌తో కలిసి అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచం ఆశలు పెట్టుకున్న వేళ దానికి సంబంధించిన ఓ నిరాశాజనక విషయం వెలుగులోకొచ్చింది. తమ వ్యాక్సిన్ 90 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఆ సంస్థలు ఇటీవలే గర్వంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
ఆర్ఎన్ఏ ఆధారిత ‘ఫైజర్’ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని, అతి శీతల వాతావరణంలో నిల్వ చేసి, ప్రజలకు ఎలా అందించాలని పలు దేశాలు ప్రణాళికలు వేసుకుంటోన్న వేళ ఆ వ్యాక్సిన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలను గుర్తించినట్లు తాజాగా వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఒంటి నొప్పి, తలనొప్పి, తీవ్రమైన హ్యాంగోవర్గా అనిపించిందని వాలంటీర్లు చెప్పారు.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ది ఇండిపెండెంట్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్‌ను ఆరు దేశాలకు చెందిన దాదాపు 43,000 మందికి దాన్ని వేశారు. వారిలో కొంతమందిలో అనారోగ్య సమస్యలు కనపడ్డాయి. తొలి డోస్‌లో సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నాయని, అయితే, రెండో డోస్ తీసుకున్న అనంతరం ఈ లక్షణాలు అధికంగా కనపడ్డాయని 'ది ఇండిపెంట్' పత్రిక తెలిపింది.
టెక్సాస్‌కు చెందిన వాలంటీర్ ఒకరు ఈ విషయాన్ని తమకు తెలిపారని పేర్కొంది. అయినప్పటికీ కొద్దిసేపటి తర్వాత అతను సాధారణ స్థితికి వచ్చారని వివరించింది. వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల తర్వాత వాలంటీర్లకు సంబంధించిన ఆరోగ్య అంశాలను 2 నెలల పాటు గమనించి, పూర్తి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ప్రతికూల ఫలితాలు వచ్చిన అంశంపై ఫైజర్ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.