Joe Biden: ట్రంప్ నిరాకరిస్తే మేం చేయాల్సిందంతా చేస్తాం: బైడెన్
- ఓటమిని అంగీకరించని ట్రంప్
- ట్రంప్ వైఖరి ఆశ్చర్యకరంగా ఉందన్న బైడెన్
- అన్నీ సజావుగా జరుగుతాయని భావిస్తున్నామని వ్యాఖ్య
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన తన ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల ఫలితాలపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. స్వయంగా తన భార్య మెలానియా ట్రంప్, సన్నిహితులు న్యాయపోరాటం వద్దని చెపుతున్నా ఆయన వినడం లేదు.
ఓటమిని అంగీకరించకుండా వ్యవహరిస్తున్న ట్రంప్ పై బైడెన్ విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ట్రంప్... ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారని అన్నారు. విల్మింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ వైఖరి ట్రంప్ కు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. అధికార బదలాయింపుకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని చెప్పారు. తాను ప్రమాణస్వీకారం చేసే జనవరి 20వ తేదీ నాటికి అన్నీ సజావుగా జరుగుతాయని అన్నారు. ట్రంప్ నిరాకరిస్తే తాము చేయాల్సింది చేస్తామని చెప్పారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఐదు దేశాల అధినేతలు తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని బైడెన్ తెలిపారు. వారిలో బ్రిటన్, జర్మనీ, ఐర్లండ్ అధినేతలు ఉన్నారని చెప్పారు. మరోవైపు ట్విట్టర్ ద్వారా భారత ప్రధాని మోదీ కూడా బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపారు.