Nandyal: నంద్యాల ఆత్మహత్యల కేసు: నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ ఈ నెల 16కి వాయిదా
- సంచలనం సృష్టించిన నంద్యాల ఆత్మహత్యలు
- సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
- ఇరువురికి బెయిల్
- బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసుల పిటిషన్
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లను అరెస్ట్ చేయగా, వారికి బెయిల్ లభించింది. అయితే వారి బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్ ప్రమేయంపై కోర్టుకు పోలీసులు ఆధారాలు సమర్పించారు. దీనిపై నంద్యాల కోర్టు ఇవాళ విచారణ జరిపింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
కాగా, ఈ కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్ కు బెయిల్ రావడానికి టీడీపీ లాయరే కారణమని వైసీపీ ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున బెయిల్ కోసం వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు టీడీపీకి రాజీనామా చేశారు.