Varavara Rao: విరసం నేత వరవరరావుకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం
- వరవరరావు మూత్రం ఆపుకోలేకపోతున్నారన్న న్యాయవాది
- ఇలాంటి వ్యక్తి ఎక్కడికి పారిపోగలడని వాదనలు
- నానావతి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తారన్న కోర్టు
- వీడియో కాల్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులకు ఆదేశం
భీమా కోరేగావ్ కుట్ర కేసులో జైల్లో ఉన్న విరసం నేత వరవరరావుకు న్యాయస్థానంలో మరోసారి వ్యతిరేక ఫలితం ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ముంబయి తలోజా జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్యం బాగా క్షీణించిందని, మంచానికే పరిమితం అయ్యారని ఆయన తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా మూత్రం ఆపుకోలేకపోతున్నారని, ప్రస్తుతం ఆయనకు డైపర్స్ అమర్చుతున్నారని వివరించారు. ఇలాంటి వ్యక్తి పారిపోగలడా? బెయిల్ మంజూరు చేయండి! అంటూ జైసింగ్ వాదనలు వినిపించారు.
దీనికి బాంబే హైకోర్టు బదులిస్తూ, వరవరరావు ఆరోగ్యం పట్ల జైలు అధికారులు చర్యలు తీసుకోవాలని, నానావతి ఆసుపత్రి వైద్యులతో వీడియో కాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీడియో కాల్ ద్వారా వైద్యులు వరవరరావును పరీక్షిస్తారని పేర్కొంది. ఒకవేళ తప్పనిసరి అయితే డాక్టర్లు స్వయంగా వచ్చి వరవరరావుకు చికిత్స చేస్తారని తెలిపింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.