Nitish Kumar: సీఎం ఎవరనే ప్రశ్నకు నితీశ్ కుమార్ సమాధానం ఇదే!
- సీఎం ఎవరనే విషయాన్ని ఎన్డీయే డిసైడ్ చేస్తుంది
- చిరాగ్ పాశ్వాన్ విషయంలో కూడా ఎన్డీయే నిర్ణయం తీసుకుంటుంది
- ఎల్జేపీ కారణంగా దాదాపు 30 సీట్లు కోల్పోయాం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో ఎన్డీయే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, సీఎం ఎవరవుతారనే విషయంలో ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దీనిపై స్పందిస్తూ... ఎవరు సీఎం కావాలనే విషయాన్ని ఎన్డీయే నిర్ణయిస్తుందని చెప్పారు. లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విషయంలో కూడా ఎన్డీయేనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ఎల్జేపీ కేవలం ఒక సీటును మాత్రమే గెలిచినప్పటికీ... జేడీయూ ఓట్లను పెద్ద సంఖ్యలో చీల్చిందని నితీశ్ అన్నారు. ఈ ఓట్ల చీలిక వల్ల జేడీయూ దాదాపు 30 స్థానాలను కోల్పోయిందని చెప్పారు.
2015 ఎన్నికలలో 71 సీట్లను గెలుపొందిన జేడీయూ... ఈ ఎన్నికలలో కేవలం 43 సీట్లకే పరిమితమైంది. దీంతో, పూర్తిగా బీజేపీ దయపై ఆధారపడాల్సిన పరిస్థితి నితీశ్ కు దాపురించింది. అయితే, జేడీయూకి ఎన్ని సీట్లు వచ్చినా మళ్లీ నితీశ్ కే సీఎం పదవిని ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.