Tejashwi Yadav: వెంటాడిన దురదృష్టం.. కేవలం 12,768 ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన తేజస్వి యాదవ్
- ఎన్డీయేకు, మహాకూటమికి మధ్య ఓట్ల తేడా 0.03 శాతం మాత్రమే
- అంత తక్కువ తేడాతో 15 సీట్లు ఎలా గెలుచుకుందని ప్రశ్నించిన తేజస్వి
- బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణ
బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేను, రాజకీయాల్లో కాకలుతిరిగిన యోధులను వణికించిన ఆర్జేడీ నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వియాదవ్ అతి స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. కేవలం 12,768 ఓట్లు ఆయనను అధికారానికి దూరం చేశాయి.
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం.. అధికార ఎన్డీయేకు 1,57,01,226 ఓట్లు (37.26 శాతం) పోలవగా, మహాకూటమికి 1,56,88,548 ఓట్లు (37.23 శాతం) ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 0.03శాతం ఓట్లు తక్కువగా పడడం వల్ల మహాకూటమి అధికారంలోకి రాలేకపోయింది.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే 125 స్థానాల్లోను, మహాకూటమి 110 స్థానాల్లోనూ విజయం సాధించింది. 20 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు వంద ఓట్ల లోపు మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. తేజస్వి యాదవ్ నిన్న అసెంబ్లీలో మహాకూటమి శాసనసభాపపక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, వాటిని మళ్లీ లెక్కపెట్టాలని ఈసీని కోరారు. ఎన్డీయేకు తమకంటే 12,760 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని, అన్ని తక్కువ ఓట్లతో 15 స్థానాలు ఎలా గెలుచుకుందని ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపు కనుక సరిగా జరిగి ఉంటే తాము 130 స్థానాల్లో విజయం సాధించి ఉండేవారమని తేజస్వి అన్నారు.