India: ఇండియాకు మద్దతిస్తూ, పాకిస్థాన్ కు కౌంటరిచ్చిన రష్యా!
- ద్వైపాక్షిక అంశాలను ఎస్సీఓలో ప్రస్తావించ వద్దు
- పాకిస్థాన్ కు తేల్చి చెప్పిన రష్యా
- రష్యా అధ్యక్షతన ఈ సంవత్సరం ఎస్సీఓ
- కశ్మీర్ అంశాన్ని ఇండియా, పాక్ లే పరిష్కరించుకోవాలని సూచన
కశ్మీర్ వంటి ద్వైపాక్షిక అంశాలను షాంఘై సహకార సంస్థ సదస్సుల్లో ప్రస్తావించేందుకు వీల్లేదంటూ పాకిస్థాన్ కు రష్యా కౌంటర్ ఇచ్చింది. ఈ గ్రూప్ ఏర్పాటు ఉద్దేశాలు, కృషి చేస్తున్న అంశాలు వేరని తేల్చి చెప్పింది. కాగా, మంగళవారం నాడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎస్సీఓ సదస్సులో అదేపనిగా అవాంఛితమైన విషయాలను ప్రస్తావించాలని కొందరు ప్రయత్నిస్తూ, ఈ గ్రూప్ సూత్రాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఆపై ఇదే సదస్సులో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని ప్రయత్నించింది,. ఈ నేపథ్యంలోనే రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబూష్కిన్ స్పందించారు. "రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్యలను ప్రస్తావించేందుకు ఇది వేదిక కాదని స్పష్టం చేయదలచుకున్నాం. సభ్య దేశాలన్నీ ఎస్సీఓ అజెండాకు కట్టుబడి వుండాలి. దేశాల మధ్య వివిధ అంశాల్లో సహకారానికి సంబంధించిన అంశాలనే ప్రస్తావించాలి" అని అన్నారు.
ఈ సంవత్సరం ఎస్సీఓ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతున్న సంగతి తెలిసిందే. సదస్సు ముగియగా, ఆపై జరిగిన మీడియా సమావేశంలో కశ్మీర్ అంశాన్ని రష్యా పరిగణనలోకి తీసుకుంటుందా? అన్న ప్రశ్నకు రోమన్ బబూష్కిన్ సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్, ఇండియా మధ్య నెలకొన్న వివాదాలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు.