TTD: తప్పులు చేసి, సారీ చెప్పడమేనా టీటీడీ పని?: సునీల్ దేవధర్ నిప్పులు
- ఈ ఉదయం తిరుమలకు వచ్చిన సునీల్ దేవధర్
- ఎస్వీబీసీ చానెల్ లో సైతం అసాంఘిక ఘటనలు
- ఆస్తులు, ఆభరణాలను కాపాడాలని సూచన
తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు తప్పులు చేయడం, ఆపై క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దేవధర్ మండిపడ్డారు. టీటీడీతో పాటు ఎస్వీబీసీ చానెల్ లో సైతం అసాంఘిక ఘటనలు జరుగుతున్నాయని, ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సునీల్ దేవధర్, ధన త్రయోదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, కరోనా మహమ్మారి త్వరగా పోవాలని, ప్రజలకు విముక్తి కలగాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు.
అయోధ్యలో జరిగిన రామాలయం భూమి పూజను సైతం టీటీడీ ప్రసారం చేయలేదని మండిపడ్డారు. ఆపై ఎస్వీబీసీ పెద్దలు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇకపై టీటీడీలోనూ, ఎస్వీబీసీ చానెల్ లోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కూడా టీటీడీ ఆస్తులను, ఆభరణాలు, నిధులను కాపాడాలని సూచించారు.