Nitish Kumar: దయచేసి నన్ను 'అహంకారి' అనవద్దు: నితీశ్ కుమార్
- బీహార్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన జేడీయూ
- బీజేపీతో కలిసుండటంతో మరోసారి నితీశ్ కు చాన్స్
- కరోనా కారణంగానే ప్రజలను కలవలేకపోయాను
- ఓ ఇంటర్వ్యూలో నితీశ్ కుమార్
ఇటీవల బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద మూడో పార్టీగా అవతరించినా, సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని ఏడోసారి పొందనున్న నితీశ్ కుమార్, తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రజలను మెప్పించని నేత సీఎంగా మారనున్నారని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన, తనను అహంకారిగా, అహంభావిగా అభివర్ణించ వద్దని కోరారు. కరోనా కారణంగా తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అది కూడా జనతాదళ్ యునైటెడ్ కు సీట్లు తగ్గేందుకు కారణమైందని అన్నారు.
తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, "దయచేసి నన్ను అహంకారినని, గర్విష్ఠినని అనవద్దు" అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కేవలం 43 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. విపక్ష ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నా, బీజేపీతో కూటమిలో కలిసున్నందున నితీశ్ కు మరోసారి సీఎంగా పనిచేసే అవకాశం లభించింది.