Remdesivir: కరోనా రోగులకు మొదట్లోనే రెమ్ డెసివిర్ ఇస్తే మెరుగైన ఫలితాలు!
- కరోనా చికిత్సలో కీలకంగా మారిన రెమ్ డెసివిర్
- తొమ్మిది రోజుల్లోపే మందు ఇస్తే రోగి కోలుకుంటాడన్న వైద్యులు
- బెంగళూరు వైద్యుల అధ్యయనం వెల్లడి
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో ఇతర వ్యాధుల చికిత్స కోసం వాడే ప్రాణాధార మందులే దీని చికిత్సలోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో విరివిగా ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ ఔషధం రెమ్ డెసివిర్. ఇంజెక్షన్ రూపంలో ఇది ఒక్కో వైల్ రూ.5,400 వరకు ధర పలుకుతోంది. కరోనా చికిత్సలో ఈ కీలక ఔషధాన్ని వినియోగించేందుకు భారత్ సహా 50 దేశాల్లో అనుమతులు ఉన్నాయి.
అయితే కరోనా చికిత్సలో ఇది ఎప్పుడు వాడాలన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటివరకు కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే, బెంగళూరు వైద్యుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కరోనా సోకిన తొలినాళ్లలోనే రెమ్ డెసివిర్ ఔషధాన్ని వాడితే మెరుగైన ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారు. కరోనా లక్షణాలు కనిపించిన 9 రోజుల్లోనే ఈ మందు వాడితే రోగి ఆరోగ్యం గణనీయంగా కుదుటపడడమే కాకుండా, మరణాల రేటు కూడా బాగా తగ్గుతున్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు.
బెంగళూరు జయానగర్ లో ఉన్న అపోలో ఆసుపత్రిలో వైద్యులు జూన్ 25 నుంచి అక్టోబరు 3 వరకు 350 మంది రోగులపై పరిశీలన చేపట్టారు. ఆ రోగులందరూ ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారే. వారికి ఏ దశలో రెమ్ డెసివిర్ ఇచ్చినప్పుడు సత్ఫలితాలు వచ్చాయన్నది తెలుసుకోవడమే ఆ అధ్యయనం ముఖ్య ఉద్దేశం.
దీనిపై అక్కడి వైద్యులు మాట్లాడుతూ, కరోనా సోకిన 9 రోజుల్లోపే రోగికి రెమ్ డెసివిర్ ఇస్తే సత్వరమే కోలుకుంటున్నట్టు గుర్తించాం అని చెప్పారు. మరణాల సంఖ్య కూడా తగ్గిందని, కరోనా ఓ మోస్తరు దశలో ఉన్నప్పుడు రెమ్ డెసివిర్ అత్యంత శక్తిమంతంగా పనిచేస్తోందని వివరించారు.
కాగా, ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించిన 350 మంది రోగుల్లో నలుగురిలో దుష్ఫలితాలు కనిపించండంతో వారిని అధ్యయనం నుంచి తప్పించారు. కాగా, ఆ రోగుల్లో అతి పెద్ద వయసు వ్యక్తి 94 ఏళ్ల వృద్ధుడు కాగా, పిన్నవయసు వ్యక్తికి 24 ఏళ్లు. మొత్తమ్మీద సగటు వయసు 60 ఏళ్లు. వీరిని ఓ మోస్తరు, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులుగా రెండు గ్రూపులుగా విభజించి అధ్యయనం చేపట్టారు.
బెంగళూరు అపోలో ఆసుపత్రి పల్మనాలజీ డిపార్ట్ మెంట్ చీఫ్ డాక్టర్ రవీంద్ర మెహతా దీనిపై స్పందిస్తూ రెమ్ డెసివిర్ తో పోల్చితే ఇతర ఔషధాలు ఏమంత స్థిరమైన ప్రభావాన్ని చూపలేకపోతున్నాయని చెప్పారు. ఓ వ్యక్తికి కరోనా సోకి ఎన్ని రోజులైందన్న విషయాన్ని పరిణగనలోకి తీసుకుని రెమ్ డెసివిర్ తో చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.