Elan Musk: కరోనా టెస్టులపై సందేహాలు వ్యక్తం చేస్తున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్
- ఒకే రోజు నాలుగు టెస్టులు చేయించుకున్న మస్క్
- రెండింట నెగెటివ్, రెండింట పాజిటివ్ వచ్చిన వైనం
- సరైన ఫలితం కోసం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకున్నట్టు వెల్లడి
తప్పుడు కరోనా కిట్ వల్ల తనకు పాజిటివ్ వచ్చిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వెల్లడించడం తెలిసిందే. ప్రముఖ టెక్ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా మస్క్ కరోనా టెస్టులపై స్పందించారు. ఈ టెస్టులపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
తాను ఒకే రోజు నాలుగు పర్యాయాలు టెస్టులు చేయించుకుంటే రెండు టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని, రెండు టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని అన్నారు. ఒకే యంత్రం, ఒకే పరీక్ష, ఒకే నర్సు... అయినా పరీక్ష ఫలితాల్లో తేడా వచ్చింది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ ల్యాబ్ లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయించుకున్న పిదప మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యాంటీజెన్ టెస్టుల్లో ఫలితాలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఆయన ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకున్నారు. ఈ టెస్టు ఫలితం కోసం వేచిచూస్తున్నట్టు మస్క్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా టెస్టుల తీరు చూస్తుంటే ఏదో బోగస్ జరుగుతున్నట్టు సందేహం వస్తోందని అన్నారు.