Ganguly: ఆసీస్ తో వన్డే, టీ20 సిరీస్ లకు రోహిత్ శర్మను ఎందుకు తీసుకోలేదో చెప్పిన గంగూలీ
- రోహిత్ ను పరిమిత ఓవర్ల సిరీస్ లకు తీసుకోకపోవడంపై విమర్శలు
- రోహిత్ 70 శాతం మాత్రమే ఫిట్ గా ఉన్నాడన్న గంగూలీ
- చెత్తవాగుడు వాగుతున్నారంటూ ఆగ్రహం
డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ ల కోసం ఎంపిక చేయకపోవడం పట్ల బీసీసీఐ తీరును విమర్శకులు తప్పుబడుతున్నారు. ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఓ మ్యాచ్ లో గాయపడగా, కొన్ని మ్యాచ్ లు విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో బీసీసీఐ సెలెక్టర్లు ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేశారు. రోహిత్ శర్మకు మొండి చేయి చూపారు.
అయితే, ఐపీఎల్ ఫైనల్లో రోహిత్ శర్మ అర్ధసెంచరీతో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు కప్ ను కూడా సాధించిపెట్టాడు. ఈ క్రమంలో విమర్శలు ఎక్కువవుతుండడంతో బీసీసీఐ వర్గాలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. రోహిత్ శర్మను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు మాత్రం ఎంపిక చేశాయి. అటుపై రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా ఆస్ట్రేలియా తరలి వెళ్లింది.
ఈ పరిస్థితులపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు. రోహిత్ శర్మ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోవాల్సి ఉందని అన్నారు. రోహిత్ శర్మ 70 శాతం మాత్రమే ఫిట్ గా ఉన్నాడని, అందుకే అతడిని ఆసీస్ టూర్ కు ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు. టెస్టు సిరీస్ కు మరికొంత సమయం ఉండడంతో ఆ లోపు కోలుకుంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకే రోహిత్ శర్మను కంగారూలతో టెస్టు సిరీస్ కు ఎంపిక చేసినట్టు వివరించారు.
కాగా, కండరాలతో గాయంతో బాధపడుతున్న మరో ఆటగాడు వృద్ధిమాన్ సాహా కూడా కేవలం టెస్టులకే ఎంపికైనా, టీమిండియా సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. రోహిత్ టెస్టు సిరీస్ మొదలయ్యేంత వరకు భారత్ లోనే ఉండనున్నాడు. దీనిపై జవాబిచ్చే క్రమంలో గంగూలీ కొంచెం అసహనానికి గురయ్యారు. ఎవరికి తెలుస్తుంది గాయాల గురించి? అంటూ వ్యాఖ్యానించారు. బీసీసీఐ పనితీరు గురించి తెలియనివాళ్లే చెత్త వాగుడు వాగుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.