Nitish Kumar: సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్
- 29వ తేదీతో ముగుస్తున్న బీహార్ అసెంబ్లీ పదవీకాలం
- తదుపరి ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తూ నితీశ్ రాజీనామా
- రెండు రోజుల్లో నితీశ్ ను తమ నేతగా ప్రకటించనున్న ఎన్డీయే
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ కు సమర్పించారు. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తోంది. దీంతో, కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తూ ఆయన రాజీనామా చేశారు. మరోవైపు తమ నేతగా నితీశ్ కుమార్ ను ఎన్డీయే అధికారికంగా ప్రకటించబోతోంది. మరో రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనుంది.
15వ తేదీన రాష్ట్రంలోని ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో తమ శాసనసభాపక్ష నేతగా నితీశ్ ను ఎన్నుకుంటారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ గవర్నర్ ను కలిసి తెలియజేస్తారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈ లాంఛనాలపై చర్చించేందుకు ఈరోజు జేడీయూ, బీజేపీ, ఇతర భాగస్వామ్య పార్టీలు భేటీ అయ్యాయి. ఎన్నికలకు ముందే నితీశ్ కుమార్ ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.