TS High Court: సుజనా చౌదరి విదేశీ ప్రయాణాన్ని అడ్డుకోవద్దు.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
- అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అధికారులు
- రేపు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన సుజనా
- ప్రయాణ వివరాలతో అఫిడవిట్ ఇచ్చి వెళ్లాలన్న కోర్టు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజానా చౌదరి విదేశీ ప్రయాణాన్ని అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న ఆయన బంధువు అనారోగ్యంతో బాధపడుతుండడంతో పరామర్శించేందుకు ప్రయాణమై, నిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అయితే, ఆయనపై గతంలో సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. తనపై జారీ అయిన లుకౌట్ నోటీసులను రద్దు చేసేలా ఆదేశాలు కోరారు. ఈ నెల 15న న్యూయార్క్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
సుజనా పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం నిన్న హౌస్‌మోషన్‌లో ఆదేశాలు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఆయన ప్రయాణాన్ని అడ్డుకోవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కోర్టు సూచించింది. అయితే, అమెరికా ప్రయాణ వివరాలతోపాటు తిరిగి ఎప్పుడు వచ్చేదీ అఫిడవిట్ రూపంలో సంబంధిత అధికారులకు వివరాలు సమర్పించాలని సుజనాను ఆదేశించింది.