Narendra Modi: మంచు కొండలు, ఎడారుల్లో సైనికులతో కలసి దీపావళి జరుపుకుంటున్నా: ప్రధాని మోదీ
- భద్రతా బలగాలకు భారతీయుల తరఫున శుభాకాంక్షలు
- వీర మరణం చెందిన సైనికులకు నివాళులు
- సైనికుల మధ్యకు వచ్చినప్పుడే నాకు అసలైన దీపావళి
- దేశాన్ని రక్షించే సైనికులను చూసి భారతావని గర్వపడుతోంది
మంచు కొండలు, ఎడారిలో నివసిస్తోన్న సైనికులతో కలసి తాను దీపావళి జరుపుకుంటున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని జైసల్మెర్లో ఆయన సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భద్రతా బలగాలకు భారతీయుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.
వీర మరణం చెందిన సైనికులకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. సైనికుల మధ్యకు వచ్చినప్పుడు తనకు అసలైన దీపావళిని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే దేశ ప్రజలు ఉత్సాహంగా ఉంటారని మోదీ తెలిపారు. దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారతావని గర్వపడుతోందని చెప్పారు. ఆక్రమణదారులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం సైనికులను ఉందని చెప్పారు. ఉగ్రవాదులను భారత్ అంతమొందిస్తోందని చెప్పారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీపడబోదని ప్రపంచం యావత్తు నేడు గుర్తిస్తోందని తెలిపారు.