Hacking: కరోనా వ్యాక్సిన్ పరిశోధనల డేటా చోరీ చేసేందుకు హ్యాకర్ల ప్రయత్నాలు
- వ్యాక్సిన్ డేటాపై కన్నేసిన హ్యాకర్లు
- తన బ్లాగ్ లో వెల్లడించిన మైక్రోసాఫ్ట్
- రష్యా, కొరియా హ్యాకర్లు చోరీకి విఫలయత్నాలు చేసినట్టు వెల్లడి
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి గుప్పిట చిక్కి విలవిల్లాడుతోంది. ఈ రాకాసి వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ కోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న తరుణంలో హ్యాకర్లు కీలకమైన వ్యాక్సిన్ డేటాపై కన్నేశారు. కరోనా వ్యాక్సిన్ పరిశోధనల సమాచారాన్ని దొంగలించేందుకు ఉత్తర కొరియా, రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ లో వెల్లడించింది.
ముఖ్యంగా, కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా, భారత్, దక్షిణ కొరియా దేశాల్లో కీలక ప్రయోగాలు జరుగుతున్నట్టు హ్యాకర్లు గుర్తించారని, అందుకే ఆయా దేశాల కరోనా పరిశోధనలే లక్ష్యంగా హ్యాకింగ్ కు ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్ వివరించింది. అయితే చాలా వరకు హ్యాకర్లు విఫలయత్నాలు చేసినట్టు తెలిపింది. ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ గ్రూప్, రష్యా సైనిక ఏజెంట్లకు చెందిన ఫ్యాన్సీ బీర్ హ్యాకర్లు పలు ఫార్మా కంపెనీలు, సైంటిస్టుల లాగిన్ వివరాలు తస్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని వెల్లడించింది.