Pune: డంప్ యార్డులో నగల బ్యాగ్... 18 టన్నుల చెత్తలో వెతికి తెచ్చిచ్చిన పుణె అధికారులు!
- పొరపాటున నగలు పారేసుకున్న మహిళ
- అధికారులను ఆశ్రయించడంతో వెతుకులాట
- బ్యాగు దొరకడంతో ఆనందం
ఓ మహిళ పొరపాటున చెత్తలో పడేసిన నగల బ్యాగు కోసం పుణె మునిసిపల్ సిబ్బంది 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేయాలని భావించిన రేఖా సెలూకర్ అనే మహిళ, అనవసరమైన చెత్తను పారేసే వేళ, తన నగలున్న బ్యాగును కూడా చెత్త బండిలో వేసింది. ఆపై రెండుగంటల తరువాత బ్యాగ్ ను చెత్తలో వేశానని గుర్తించి బోరుమంది.
వెంటనే స్థానిక మునిసిపల్ అధికారిని కలిసి తన బాధ వినిపించింది. ఆ నగల్లో తన మంగళసూత్రం కూడా ఉందని మొరపెట్టుకుంది. ఆ వెంటనే స్పందించిన అధికారులు, చెత్త తీసుకెళ్లిన బండి కోసం వెతకగా, అప్పటికే, అది డంప్ యార్డులో చేరి, చెత్తను పారేసి వచ్చేసిందని తెలిసింది. దీంతో దాదాపు 18 టన్నులకు పైగా ఉన్నచెత్తలో ఆమె బ్యాగు కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు ఆమె బ్యాగు కనిపించడంతో, ఆనందంతో రేఖ మునిసిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పింది.