Corona Virus: అదే జరిగితే అప్పుడిక టీకాతో పని ఉండదు: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా
- టీకా కంటే ముందే ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ
- వైరస్ పరివర్తన చెందితే మాత్రం టీకా తప్పనిసరి
- వైరస్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు ఓ అంచనాకు రాలేం
కరోనా టీకా ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన సమాచారం లేదు. అయితే, అది అందుబాటులోకి రావడానికి ముందే దేశ ప్రజలు పూర్తి ఇమ్యూనిటీని (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధిస్తారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. పూర్తిస్థాయిలో రోగ నిరోధక శక్తి సాధిస్తే అప్పుడు టీకా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు. వైరస్ పరివర్తన చెందితే మాత్రం వైరస్ మళ్లీ సోకకుండా టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైరస్ ఎలా స్పందిస్తుందనే దానిపై అంచనా వేస్తున్నామని, దానిని బట్టి టీకాను ఎలా తీసుకోవాలనే దానిపై ఓ అంచనాకు రావొచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అభివృద్ధి చేస్తున్న కొవిడ్ టీకాల్లో కొన్ని తుది దశ పరీక్షల్లో ఉండగా, మరికొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. చివరి దశ ప్రయోగాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగితే ఈ ఏడాది చివరల్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, టీకా అందరికీ అందుబాటులోకి రావాలంటే మాత్రం మరో రెండుమూడేళ్లు ఆగక తప్పదని, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన భారత్ లాంటి దేశంలో ప్రతి ఒక్కరికీ టీకాను అందించడం సవాలుతో కూడుకున్న విషయమని నిపుణులు చెబుతున్నారు.