USA: డిసెంబర్ లో 2 కోట్ల మంది అమెరికన్లకు కరోనా టీకా!
- యూఎస్ లో రోజుకు లక్షకు పైగా కేసులు
- ఇప్పటికే ఫైజర్ టీకాతో సత్ఫలితాలు
- మరో వ్యాక్సిన్ కూడా సిద్ధమవుతోంది
- వ్యాక్సిన్ కమిటీ చీఫ్ మోన్సెఫ్ స్లోయి
రోజుకు దాదాపు లక్షకు పైగా కేసులు నమోదవుతున్న అమెరికాలో, వచ్చే నెలలో కనీసం 2 కోట్ల మందికి కరోనా టీకాలను ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. తొలుత సత్ఫలితాలను ఇస్తున్న ఫైజర్ టీకాను పంచాలని అధికారులు నిర్ణయించి, ఆ మేరకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే మోన్సెఫ్ స్లోయి నేతృత్వంలో వ్యాక్సిన్ పంపిణీని సమన్వయ పరిచేందుకు వైట్ హౌస్ కేంద్రంగా ఓ కమిటీ కూడా ఏర్పడింది.
డిసెంబర్ ముగిసేలోగా 2 కోట్ల మందికి, ఆపై నెలకు 3 కోట్ల మంది వరకూ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని, అందుకు సరిపడినన్ని డోస్ లను తయారు చేసేందుకు వ్యాక్సిన్ తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని మోన్సెఫ్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, యూఎస్ ఎఫ్డీయే నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు రాగానే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
కాగా, యూఎస్ లో కరోనా కేసులు 1.07 కోట్లను దాటగా, ఇప్పటికే 2.44 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యూఎస్ లో ఆరు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఆర్ఎన్ఏ విధానంలో తయారు చేసిన ఫైజర్ టీకా మంచి ఫలితాలను ఇస్తుండగా, ఇదే విధానంలో తయారైన మరో టీకా కూడా అందుబాటులోకి వస్తే, తక్కువ సమయంలోనే మరిన్ని డోస్ లను అందుబాటులోకి తెచ్చి, ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక, ఫైజర్ తో పాటు వ్యాక్సిన్ తయారీలో ముందున్న మోడెర్నా నుంచి కూడా త్వరలోనే ఓ శుభవార్త వస్తుందని పేర్కొన్న మోన్సెఫ్, ఏ వ్యాక్సిన్ సమర్థతపై పాజిటివ్ ఫలితాలు వచ్చినా, వెంటనే దాన్ని భారీ ఎత్తున తయారు చేయిస్తామని తెలిపారు.