Mopidevi Venkataramana: సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: మోపిదేవి
- చంద్రబాబు ఏపీ ఆదాయాన్ని వాడుకున్నారు
- అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి
- ఆర్థిక పరిస్థితిని జగన్ 17 నెలల్లోనే గాడిలో పెట్టారు
- సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోపిదేవి మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఏపీ ఆదాయాన్ని సొంత ఆదాయంలా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ 17 నెలల్లోనే గాడిలో పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ అందిస్తోన్న పాలనను చూసి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. వైసీపీ ఎన్నికల మందు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90 శాతానికి పైగా అమలు చేశామని అన్నారు.