Sputnik V: కాన్పూరుకు రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి.. త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్
- గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో పరీక్షలు
- ఏడు నెలలపాటు జరగనున్న క్లినికల్ ట్రయల్స్
- ట్రయల్స్ కోసం 180 మంది వలంటీర్ల రిజిస్ట్రేషన్
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వికి కాన్పూరులోని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో రెండు, మూడు దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. ఇందుకోసం టీకా ఫస్ట్‌బ్యాచ్ త్వరలోనే కాన్పూరు చేరుకోనుంది.
‘స్పుత్నిక్-వి’కి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. రష్యా వ్యాక్సిన్‌కు మరికొన్ని రోజుల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ హెడ్ ఆర్బీ కమల్ చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ కోసం 180 మంది వలంటీర్లు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు.
వలంటీర్లకు తొలుత ఒక మోతాదు ఇస్తామని, ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత తదుపరి మోతాదు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని మెడికల్ కాలేజీ పరిశోధన విభాగాధిపతి సౌరభ్ అగర్వాల్ తెలిపారు. వలంటీర్ల డేటాను పరిశీలించిన తర్వాత టీకా విజయవంతమైందా? లేదా? అన్నది విశ్లేషిస్తామన్నారు. మొత్తం ఏడు నెలలపాటు ప్రయోగాలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టీకాను మైనస్ 20 నుంచి మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుందని వివరించారు.