Kamal Haasan: "పతితులార భ్రష్టులార" అంటూ తమిళ బిగ్ బాస్ ఇంట్లో శ్రీశ్రీ కవితను చదివిన కమలహాసన్... వీడియో ఇదిగో!

Kamal Haasan recites Sri Sri Poem in Tamil Bigg Boss house

  • తెలుగు భాష గురించి కమల్ వ్యాఖ్యలు
  • అందమైన భాష అంటూ భారతీయార్ వ్యాఖ్యలను ఉదాహరించిన వైనం
  • మహాప్రస్థానం కవితాసంపుటి గురించి వివరణ

తమిళంలో భారతీయార్ (సుబ్రహ్మణ్య భారతి) సుప్రసిద్ధ కవి. ఎంతో ఆధునిక భావాలున్న ఆయన అందరికీ అర్ధమయ్యే భాషలో శక్తిమంతమైన కవిత్వాన్ని సృజించారు. తాజాగా, విశ్వనటుడు కమలహాసన్ తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ షోలో భారతీయార్ గురించి చెబుతూ, తెలుగు మహారచయిత శ్రీశ్రీ గురించి కూడా ప్రస్తావించారు.

శ్రీశ్రీ రచించిన 'మహాప్రస్థానం' కవితా సంపుటిలోని "పతితులార భ్రష్టులార, బాధాసర్ప దష్టులార" (జగన్నాథుని రథచక్రాలు) అంటూ సాగే కవితను భావయుక్తంగా వినిపించారు. ఆ కవితాసంపుటి ఔన్నత్యాన్ని, శ్రీశ్రీ గొప్పదనాన్ని తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కమల్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కమల్ మాట్లాడుతూ, తెలుగు అందమైన భాష అని పొగిడారు. భారతీయార్ అంతటివాడు కూడా తెలుగును "సుందర తెనుంగు" అంటూ అభివర్ణించారని తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన శ్రీశ్రీ గురించి చెప్పారు.

కాగా, కమలహాసన్ సినీ ప్రస్థానంలో ఆణిముత్యం అనదగ్గ చిత్రం 'ఆకలిరాజ్యం'. ఈ సినిమాలో అభ్యుదయ భావాలున్న యువకుడిగా కనిపించిన కమల్ ఆయా సన్నివేశాలకు అనుగుణంగా పలుమార్లు శ్రీశ్రీ కవితలు పఠిస్తుంటాడు. నాటి షూటింగ్ సమయంలో నేర్చుకున్న 'మహాప్రస్థానం' కవితలను ఇప్పటికీ ఆయన గుర్తుంచుకోవడం విశేషం. పైగా ఎంతో స్పష్టంగా 'పతితులార భ్రష్టులార' అనే కవితను చదవడం ఈ వీడియోలో చూడొచ్చు.

  • Loading...

More Telugu News