Diwali: ఈ దీపావళికి భారత్ లో అమ్మకాల జోరు... చైనాకు రూ.40 కోట్ల నష్టం!
- చైనా ఉత్పత్తులపై నిషేధం ప్రకటించిన సీఏఐటీ
- భారత్ లో పండుగ అమ్మకాల విలువ రూ.72 వేల కోట్లు
- లాభాల బాటలో దేశీయ ఉత్పత్తిదారులు
సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో కొన్నిరకాల చైనా వాణిజ్య ఉత్పత్తులను భారత్ లో నిషేధించడం తెలిసిందే. ఈ నిర్ణయం తాలూకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా భారతీయ కంపెనీలు బాగా లాభపడ్డాయి. ఈ వెలుగుల పండుగ సందర్భంగా భారత్ లో రూ.72 వేల కోట్ల మేర అమ్మకాలు జరగ్గా, చైనా ఎగుమతిదారులు మాత్రం రూ.40 వేల కోట్ల మేర నష్టపోయారు. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఓ ప్రకటనలో తెలిపింది.
గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి భారత సైనికులు చనిపోయిన తర్వాత సీఏఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో చైనా ఉత్పత్తులు విక్రయించరాదని పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ దీపావళికి అధికంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, బొమ్మలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వంటగది వస్తు సరంజామా, గిఫ్టులు, స్వీట్లు, తినుబండారాలు, బంగారం, పాదరక్షలు, వాచీలు, ఫర్నిచర్, దుస్తులు అమ్ముడయ్యాయి.
దీనిపై సీఏఐటీ స్పందిస్తూ భవిష్యత్ లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. దేశీయ ఉత్పత్తిదారులకు మంచిరోజులు వస్తాయని అభిప్రాయపడింది.