BJP: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ కమిటీలు.. జనసేనతో కలిసి బీజేపీ పోటీ?
- 24 నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌ల నియామకం
- మల్కాజ్‌గిరికి రఘునందన్ రావు, నాంపల్లికి సోయం బాపురావు
- ఎన్నికల కమిటీలను వేసిన కాంగ్రెస్
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఇచ్చిన జోష్‌తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దూసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది.
మల్కాజ్‌గిరికి రఘునందన్ రావు, శేరిలింగంపల్లికి అరవింద్, అంబర్‌పేటకు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎల్బీ నగర్‌కు సంకినేని, మహేశ్వరానికి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాంపల్లికి సోయం బాపురావు, కూకట్‌పల్లికి పెద్దిరెడ్డి, రాజేంద్రనగర్‌కు మోత్కుపల్లిని నియమించింది.
ఇతర ప్రాంతాల్లోనూ పలువురు నేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. వారంతా ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ కూడా సమాయత్తమవుతోంది. పార్లమెంట్ వారీగా ఇప్పటికే ఎన్నికల కమిటీలను వేసింది. ఆయా కమిటీల్లో ఐదుగురు చొప్పున నేతలు సభ్యులుగా ఉంటారు. ఆ జాబితాను ఈ రోజే విడుదల చేయనుంది. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు ఇఫ్పటికే కాంగ్రెస్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.