Sanjay Raut: దేశానికి అవసరమైనప్పుడు హిందుత్వ ఖడ్గాన్ని బయటకు తీస్తాం: శివసేన నేత సంజయ్ రౌత్
- మా హిందుత్వం గురించి ఏ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు
- ఎప్పుడూ మేము హిందుత్వవాదులమే
- ఆలయాలను మూసేసింది ప్రధాని మోదీనే
మొన్నటి వరకు మంచి మిత్రులుగా ఉన్న బీజేపీ, శివసేనల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. హిందుత్వ కార్డును శివసేన పక్కన పెట్టేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దేశానికి అవసరమైనప్పుడు హిందుత్వ ఖడ్గాన్ని బయటకు తీస్తామని చెప్పారు. శివసేన ఎప్పటికీ హిందుత్వవాదేనని అన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ హిందుత్వం గురించి తమకు ఏ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. గతంలో, ఇప్పుడు, ఎప్పుడైనా సరే తాము హిందుత్వవాదులమేనని చెప్పారు. అయితే వారి మాదిరి తాము హిందుత్వ రాజకీయాలు చేయలేమని అన్నారు. మహారాష్ట్రలో దేవాలయాలను మళ్లీ తెరవాలని శివసేన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ విజయమేనని బీజేపీ చేసిన వ్యాఖ్యలను సంజయ్ తప్పుపట్టారు.
దేశంలో లాక్ డౌన్ విధించింది ప్రధాని మోదీ అని, ఆలయాలను మూసేయాలని చెప్పింది కూడా ఆయనే అని... అందువల్ల ఈ విషయంలో హిందుత్వ గెలిచిందంటూ బీజేపీ క్రెడిట్ తీసుకోవాలనుకోవడంలో అర్థమేలేదని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.