Chandrababu: జగన్ మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి: చంద్రబాబు

Chandrababu says Jagan downfall should start from Tirupati by polls

  • టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • హాజరైన 175 అసెంబ్లీ స్థానాల పార్టీ ఇన్చార్జిలు
  • తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఉద్బోధ

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఉద్బోధించారు. జగన్ మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలు వైసీపీ అరాచకాలకు గుణపాఠం చెప్పే వేదిక కావాలని అన్నారు.

ఇక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంలోనూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు విత్ డ్రా చేయించిందని ఆరోపించారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, ఎన్నికల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరారు. కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు ఆయన పోలవరం, అమరావతి అంశంపై స్పందించారు. టీడీపీకి పేరు వస్తుందనే అమరావతి, పోలవరం ఆపేశారని విమర్శించారు. "25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పుడు 28 మంది ఎంపీలున్నా నోరు తెరవకపోవడాన్ని ప్రజలే నిలదీయాలి. రివర్స్ టెండర్లతో పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ముంపు బాధితులను నమ్మించారు. ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోయినా ఫర్వాలేదంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించినా ఫర్వాలేదని అనడం జగన్ నమ్మకద్రోహం. 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుంటే విమర్శించి, 30 ఏళ్లకు కుదుర్చుకోవడం మరో మోసం. దొడ్డిదారిన విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపారు" అని వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News