TRS: టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు.. కాంగ్రెస్ పార్టీనే: మంత్రి జగదీశ్ రెడ్డి
- దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి నిర్లక్ష్యమే కారణం
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
- కనీసం 100 స్థానాలను కైవసం చేసుకుంటాం
జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణలోనే కాకుండా ఏపీలో సైతం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ రంగంలోకి దూకాయి. అప్పుడే అన్ని పార్టీల నేతలు తమ కార్యాచరణను మొదలు పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మైండ్ గేమ్ తో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి యత్నిస్తున్నారు.
తాజాగా టీఆర్ఎస్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్థి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే తమ ప్రత్యర్థి అని చెప్పారు. దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి నిర్లక్ష్యమే కారణమని అన్నారు.
గత 60 ఏళ్లలో ఏ పార్టీ చేయలేని అభివృద్ధిని ఆరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిందని జగదీశ్ రెడ్డి చెప్పారు. భారీ వరదల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎదే విజయమని చెప్పారు. మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కనీసం 100 స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు.