Andhra Pradesh: ఈ పరిస్థితుల్లో ఎన్నికలా?.. సాధ్యం కాదు: నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ

AP CS Neelam Sahni writes letter to Nimmagadda Ramesh Kumar

  • ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు
  • కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది చనిపోయారు
  • పరిస్థితి అనుకూలిస్తే సమాచారం అందిస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న వేళ సీఎస్ నీలం సాహ్ని స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని, కరోనా నేపథ్యంలో చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని సీఎస్ ఆ లేఖలో ప్రస్తావించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి సమయంలో మరోమారు కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు కనుక ఎన్నికలు నిర్వహిస్తే వైరస్ గ్రామాలకు కూడా పాకిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పరిపాలన సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్న సీఎస్.. పరిస్థితి అనుకూలించిన వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని అన్నారు.

కాబట్టి ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపై మరోమారు ఆలోచించాలని కోరారు. అలాగే, నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసిందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది అవసరం లేదని తాము భావిస్తున్నట్టు నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News