Putin: మా వ్యాక్సిన్ ను ఇండియాలో తయారు చేసుకోవచ్చు: వ్లాదిమిర్ పుతిన్
- బ్రిక్స్ దేశాల్లో వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్లు
- ఇండియాతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ను తయారు చేసుకోవచ్చు
- ఇప్పటికే ఆర్డీఐఎఫ్ తో డీల్ కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్
తాము తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ టీకాను ఇండియా తయారు చేసుకోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. ఇండియాతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని పుతిన్ వెల్లడించినట్టు 'ఆర్ఐఏ' న్యూస్ ఏజన్సీ పేర్కొంది. ఇక బ్రిక్స్ దేశాల్లో వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేయాలని కూడా పుతిన్ సూచించారు.
రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రజలను కరోనా నుంచి రక్షించడంలో 92 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను రష్యాలో వాడేందుకు ఆగస్టులోనే పుతిన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆ తరువాతే భారీ ఎత్తున ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
ఆపై సెప్టెంబర్ లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో ఇండియాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ వ్యాక్సిన్ తయారీ కోసం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇండియాలో స్పుత్నిక్ ట్రయల్స్, ఆపై పంపిణీని డాక్టర్ రెడ్డీస్ పర్యవేక్షించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోస్ లను ఆర్డీఐఎఫ్ ఇండియాకు పంపించనుంది. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, ఈ వ్యాక్సిన్ డోస్ లను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని రెడ్డీస్ ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు.