Raghu Rama Krishna Raju: వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించండి: ఎన్నికల సంఘానికి రఘురాజు లేఖ
- స్థానిక ఎన్నికలపై మరోసారి ఏపీలో రాజకీయ వేడి
- 2021, ఫిబ్రవరిలో నిర్వహించాలని భావిస్తోన్న ఈసీ
- వెంటనే ప్రకటన విడుదల చేయాలని కోరిన రఘరామ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను 2021, ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కింది.
కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదంటూ సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా లేఖ రాయడం గమనార్హం.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఇందుకు ప్రకటన విడుదల చేయాలని ఆయన కోరడం గమనార్హం. కరోనా ప్రభావం తగ్గిందని, పొరుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏపీలోనూ నిర్వహించాలని రఘురామ లేఖలో రాసుకొచ్చారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇసుక విధానం దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే, మాన్సాస్ ట్రస్టు విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ట్రస్టు ఆస్తుల పరిరక్షణ బాధ్యతను అశోక్‌గజపతి రాజుకు అప్పగించాలన్నారు.