Sajjala: బాధ్యతాయుత ప్రభుత్వంగా ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నాం: సజ్జల
- ఎన్నికలు ఎప్పుడు జరిగినా 90 శాతానికి పైగా సీట్లను సాధిస్తాం
- వేలాది కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు?
- కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ భావన
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి ఒక రాజకీయ పార్టీగా వైసీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ స్థానంలో ఉన్న తాము... రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నామని అన్నారు.
అసలు ఎన్నికలు ఎప్పుడు జరిగినా 90 శాతానికి పైగా సీట్లను గెలుచుకోగలిగే సత్తా వైసీపీకి ఉందని చెప్పారు. ఒకటి, రెండు కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసి... వేల కేసులు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని ఒకవైపు చీఫ్ సెక్రటరీ చెపుతుంటే... ఎస్ఈసీ రమేశ్ కుమార్ గారికి తొందర ఎందుకని నిలదీశారు.
కరోనా కేసులు తగ్గిన తర్వాత ఎన్నికలను నిర్వహంచాలనేది తమ ప్రభుత్వ భావన అని సజ్జల అన్నారు. షెడ్యూల్ ప్రకారం అప్పుడే ఎన్నికలను నిర్వహిస్తే పోయేదని చెప్పారు. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డ రమేశ్ అంతరార్థం ఏమిటనేది తమకు అర్థమయిందని అన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఒక పార్టీని ఫాక్షనిస్టు పార్టీ అని మాట్లాడిన వ్యక్తి ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఉంటారని తాము భావించలేమని అన్నారు.