Gali janardhan Reddy: ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారం.. డిశ్చార్జ్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న గాలి జనార్దన్‌రెడ్డి

Gali Janardhan Reddy withdraw his discharge petition

  • రాజకీయ ఒత్తిళ్లతోనే సీబీఐ కేసులన్న గాలి జనార్దన్‌రెడ్డి
  • సరిహద్దు వివాదమే తేలకుండా అక్రమ మైనింగ్ అని ఎలా చెబుతారని ప్రశ్న
  • బెయిలు కుంభకోణం కేసు విచారణ 24కు వాయిదా

ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ కేసులో రెండో నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను నిన్న ఉపసంహరించుకున్నారు. ఓఎంసీ కేసులో రాజకీయ ఒత్తిళ్లతోనే సీబీఐ తనపై కేసు నమోదు చేసిందని పేర్కొన్న గాలి.. మైనింగ్ చట్టాలు, అటవీ చట్టం కింద కాకుండా, ఐపీసీ కింద అభియోగాలు నమోదు చేసిందని, నిజానికి అవి తనకు వర్తించవని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దు వివాదమే తేలకుండా అక్రమ మైనింగ్ అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నిన్న ఈ పిటిషన్ విచారణకు రాగా, సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు.

ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ గతంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు గాలి తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. దీనిపై ఎటువంటి వాదనలు వినిపించబోమని చెప్పడంతో అనుమతించిన కోర్టు డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. గాలి పీఏ మెఫజ్ అలీఖాన్, మాజీ ఐఏఎస్ కృపానందం దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. అలాగే, గాలి జనార్దన్‌రెడ్డి బెయిలు కుంభకోణానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News