WHO: జంతువుల్లో కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రణాళికలు
- ఇప్పటికే పలు జంతువుల్లో బయటపడ్డ కరోనా
- జంతువుల ద్వారా వైరస్ మరింత విజృంభించకుండా జాగ్రత్తలు
- ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనకు డబ్ల్యూహెచ్‌ఓ సిద్ధం
- మొత్తం 500 రకాల జంతుజాతులపై పరిశోధన
కరోనా వైరస్ ఇప్పటికే పలు జంతువుల్లో బయటపడ్డ విషయం తెలిసిందే. గబ్బిలాలు, మింక్స్, పిల్లులు, ప్యాంగోలిన్ వంటి పలు జంతువుల్లో కరోనా సారూప్య వైరస్‌లను పరిశోధకులు గుర్తించారు. వాటితో పాటు ఇతర జంతువుల కారణంగా వైరస్ మరింత విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిద్ధమైంది.
జంతువుల్లో కరోనాను అరికట్టే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పరిశోధనలు చేయాలని భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 500 రకాల జంతుజాతులపై ఈ పరిశోధన జరపడానికి రెండు దశల ప్రణాళికలను తయారుచేసింది. ఇందులో 194 సభ్య దేశాలు భాగస్వాములు కావాలని సూచించింది. సీరో ప్రివలెన్స్ అధ్యయనాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపింది.
జంతువుల ద్వారా ఇతర జంతువులకు కరోనా వైరస్ వ్యాప్తి ఏ మేరకు జరుగుతుంది? వాటి ద్వారా మనుషులకు వైరస్ సోకే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏయే జంతువులు ఎంత స్థాయిలో కరోనాను వ్యాప్తి చేయగలవు? వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో కరోనాతో మరింత ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నాయి.
కాగా, పరిశోధకులు ఇప్పటికే గబ్బిలాల్లో గుర్తించిన ఆర్ ఏటీజీ13, ఆర్ ఎంవైఎన్02 జీనోమ్‌లలో కరోనా వైరస్‌తో వరుసగా 96.2, 93.3 శాతం సారూప్యత ఉందని గుర్తించారు. పలు దేశాల్లో పలు జంతువులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.