Bihar: జాతీయ గీతాన్ని తప్పుగా పాడిన బీహార్ విద్యా శాఖ మంత్రి.. తీవ్ర విమర్శలు
- మేవలాల్ చౌదరీపై మండిపడుతున్న ఆర్జేడీ, నెటిజన్లు
- ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి
- జాతీయ జెండా ఎగురవేసిన మేవలాల్
- పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా అంటూ పాడిన మంత్రి
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా మేవలాల్ చౌదరీ ప్రదర్శించిన తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు కూడా ఆయనను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీహార్ విద్యాశాఖ మంత్రి మేవలాల్ చౌదరీ తాజాగా ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి, జాతీయ గీతం పాడారు. అయితే, ఆయన జాతీయ గీతాన్ని తప్పుగా పాడడం పట్ల విమర్శలు వస్తున్నాయి. జనగణమణ పాడుతూ మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు.
అందులో 'పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా' అనడానికి బదులుగా 'పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా' అంటూ పాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోన చూశారు. విద్యా శాఖ మంత్రి అయ్యుండి ఆయనకు కనీసం జాతీయ గీతం కూడా రావట్లేదని విమర్శలు వస్తున్నాయి.
అనేక అవినీతి కేసుల ఆరోపణల్లో ఉన్న మేవలాల్ చౌదరికి జాతీయ గీతం కూడా తెలియదని ఆర్జేడీ విమర్శలు చేసింది. గతంలో ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్‌గా ఉన్న సమయంలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో మేవలాల్ పై ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకు విద్యా శాఖ మంత్రి పదవి దక్కడం గమనార్హం.