Delhi: పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ ధరించకపోతే రూ.2000 జరిమానా: కేజ్రీవాల్
- ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై ప్రభుత్వం కన్నెర్ర
- జరిమానా రూ. 500 నుంచి రూ. 2000కు పెంపు
ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. దీంతో, అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా మాస్కులు ధరించకుండా, రోడ్లపై బాధ్యతా రాహిత్యంగా తిరుగుతున్న వారిపై కన్నెర్ర చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 2 వేల జరిమానా విధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటి వరకు రూ. 500గా ఉన్న జరిమానాను రూ. 2 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు.
కరోనా మహమ్మారిపై ఈరోజు కేజ్రీవాల్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా నేపథ్యంలో అదనంగా ఐసీయూ బెడ్లు, ఇతర వసతులు కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెపుతున్నామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను పంపిణీ చేయాలని అన్ని రాజకీయ పార్టీలను, సామాజిక సంస్థలను కోరారు.ఫై