Dharmapuri Srinivas: సొంత పార్టీ టీఆర్ఎస్ పై డీఎస్ విమర్శలు

My party forgotten me says D Srinivas

  • టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉంది
  • హైదరాబాదులో అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోంది?
  • ప్రజల్లో విశ్వసనీయతను టీఆర్ఎస్ పెంచుకోవాలి

టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం నిజంగా పని చేసి ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదని అన్నారు. వరద బాధితులకు పూర్తి సాయాన్ని అందించిన తర్వాతే ఎన్నికలు పెట్టి ఉండొచ్చని, ఇంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాదులో రూ. 68 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్నారని... ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని డీఎస్ ప్రశ్నించారు. నగరంలోని ఫ్లైఓవర్లను కాంగ్రెస్ హయాంలోనే కట్టారని... ఇప్పుడు వాటి నిర్వహణను కూడా సరిగా చేయడం లేదని దుయ్యబట్టారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్... రాష్ట్రం కంటే కేంద్రం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారని అన్నారు.

దుబ్బాక నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల నియోజకవర్గాలకు ఆనుకునే ఉంటుందని... అక్కడ జరిగిన ఉపఎన్నికలో ప్రజల ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా అర్థమైందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా పని చేసి ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వసనీయతను పెంచుకోవాలని అన్నారు. తనను టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News